2 Kings 13

1యూదా రాజు అహజ్యా కుమారుడు యోవాషు పరిపాలనలో 23 వ సంవత్సరంలో యెహూ కుమారుడు యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలుపై తన పరిపాలన మొదలు పెట్టాడు. అతడు 15 సంవత్సరాలు ఏలాడు. 2ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారకుడైన నెబాతు కుమారుడు యరొబాము పాపాలను వదలకుండా అనుసరిస్తూ యెహోవా దృష్టిలో దుర్మార్గంగా ప్రవర్తించాడు.

3కాబట్టి యెహోవా కోపం ఇశ్రాయేలు వారిపై రగులుకుంది. ఆయన సిరియా రాజు హజాయేలు కాలంలోనూ హజాయేలు కుమారుడు బెన్హదదు కాలంలోనూ ఇశ్రాయేలు వారిని వారి వశం చేశాడు. 4అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా సిరియా రాజు మూలంగా బాధలు పడుతున్న ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించాడు. 5ఎలాగంటే యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుణ్ణి ఇచ్చాడు. అతని మూలంగా ఇశ్రాయేలు వారు సిరియా వారి వశంలోనుండి తప్పించుకుని మునుపటి లాగానే తమ సొంత పల్లెల్లో కాపురం ఉన్నారు.

6అయినా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణభూతుడైన యరొబాము కుటుంబికులు చేసిన పాపాలనే వారు కూడా వదలకుండా అనుసరించారు. ఆ దేవతాస్తంభాలు షోమ్రోనులో అలానే నిలిచి ఉన్నాయి. 7అశ్వికులు 50 మంది, రథాలు పది, కాల్బలం పదివేలమంది మాత్రమే యెహోయాహాజు దగ్గర మిగిలారు. మిగిలిన వారిని సిరియా రాజు తూర్పారబట్టిన పొట్టు లాగా నాశనం చేశాడు.

8యెహోయాహాజు గురించిన మిగతా విషయాలు, అతడు చేసిన మిగతా పనులు, అతడు చూపిన పరాక్రమం ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథంలో రాసి ఉంది కదా. 9యెహోయాహాజు తన పూర్వికులతో కన్ను మూశాడు. అతణ్ణి షోమ్రోనులో పాతిపెట్టారు. అతని కుమారుడు యెహోయాషు అతని స్థానంలో రాజయ్యాడు.

10యూదారాజు యోవాషు పరిపాలనలో 37 వ సంవత్సరాన యెహోయాహాజు కుమారుడు యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలుపై పరిపాలన మొదలు పెట్టి 16 సంవత్సరాలు ఏలాడు. 11ఇతడు కూడా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణభూతుడైన నెబాతు కుమారుడు యరొబాము చేసిన పాపాలను వదలకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టికి దుర్మార్గంగా ప్రవర్తించాడు.

12యెహోయాషు చేసిన మిగతా పనులు, అతని చర్యలన్నిటి గురించీ యూదా రాజు అమజ్యాతో యుద్ధమాడినప్పుడు అతడు కనుపరచిన పరాక్రమం గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథంలో రాసి ఉంది కదా.

13యెహోయాషు తన పూర్వికులతో కన్నుమూసిన తరవాత అతని సింహాసనంపై యరొబాము ఆసీనుడయ్యాడు. యెహోయాషును షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధిలో పాతిపెట్టారు.

14ఎలీషా మరణాంతక వ్యాధి బారిన పడ్డాడు. ఇశ్రాయేలు రాజు యెహోయాషు అతని దగ్గరకు వచ్చి అతణ్ణి చూసి కన్నీరు కారుస్తూ <<నా తండ్రీ, నా తండ్రీ, ఇశ్రాయేలు ప్రజలకు రథం, అశ్వికదళం నువ్వే కదా>> అని విలపించాడు.

15అప్పుడు ఎలీషా <<విల్లంబులు తీసుకురా>> అని అతనితో చెప్పాడు. అతడు అలానే చేశాడు. 16<<నీ చెయ్యి విల్లుపై వెయ్యి >>అని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పాడు. అతడు తన చెయ్యి విల్లుపై ఉంచాడు. ఎలీషా రాజు చేతుల మీద తన చేతులు పెట్టి

17<<తూర్పు వైపు కిటికీ తెరువు>> అన్నాడు. రాజు అలానే చేశాడు. అప్పుడు ఎలీషా <<బాణం వెయ్యి>> అని చెప్పగా అతడు బాణం వేశాడు. అతడు<<ఇది యెహోవా రక్షణ బాణం. సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించే బాణం. సిరియనులు నాశనమయ్యేలా నీవు అఫెకులో వారిని హతమారుస్తావు>> అని చెప్పాడు. 18ఈసారి ఎలీషా<<బాణాలు పట్టుకో>>అని చెప్పగా అతడు పట్టుకున్నాడు.అప్పుడు ఎలీషా ఇశ్రాయేలు రాజుతో<<నేలను కొట్టు>>అన్నాడు. అతడు మూడు సార్లు కొట్టి ఊరుకున్నాడు.

19అది చూసి దైవసేవకుడు అతనిపై మండిపడి <<నీవు ఐదారు సార్లు కొట్టి ఉంటే సిరియనులు నాశనమయ్యే దాకా నీవు వారిని నిర్మూలం చేసి ఉండే వాడివి. అయితే ఇప్పుడు మూడు సార్లు మాత్రమే సిరియనులను ఓడిస్తావు>> అని చెప్పాడు.

20తరువాత ఎలీషా చనిపోయాడు. వాళ్ళు అతణ్ణి సమాధిలో పెట్టారు. ఒక సంవత్సరం తరవాత మోయాబీ దోపిడీ దారుల గుంపులు దేశంపై దండెత్తారు. 21కొందరు ఒక శవాన్ని పాతిపెడుతూ శత్రు సైన్యానికి భయపడి ఆ శవాన్ని ఎలీషా సమాధిలో పెట్టారు. సమాధిలో దింపిన ఆ మృతదేహం ఎలీషా ఎముకలు తగలగానే తిరిగి బతికి అతడు తన కాళ్ళపై నిలబడ్డాడు.

22యెహోయాహాజు కాలమంతా సిరియారాజు హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధించాడు. 23అయితే యెహోవా వారిపై జాలిపడి దయ చూపి అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను బట్టి వారిపై శ్రద్ధ చూపి, వారిని నాశనం చేయడానికి ఇష్టపడలేదు.ఇప్పటికీ తన సముఖం లోనుండి వారిని వెళ్లగొట్టలేదు. 24సిరియారాజు హజాయేలు చనిపోగా అతని కుమారుడు బెన్హదదు అతనికి స్థానంలో రాజయ్యాడు.

యెహోయాహాజు కొడుకు యెహోయాషు హజాయేలు కొడుకు బెన్ హదదు తన తండ్రి యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధంలో స్వాధీనం చేసుకున్న పట్టణాలను తిరిగి వశపరచుకున్నాడు. యెహోయాషు అతణ్ణి మూడు సార్లు జయించి ఇశ్రాయేలు నగరాలను తిరిగి వశపరచుకున్నాడు.

25

Copyright information for TelULB